పోలీస్ ప్రతిష్టకు ఆదర్శంగా నిలిచిన రేవతి - ఆర్ సి పి అధ్యక్షులు మేడా శ్రీనివాస్
క్యాపిటల్ వాయిస్, రాజమండ్రి :-తమిళనాడులోని సాత్తాంకుళం పోలీస్ స్టేషన్ ఘటనకు సంబంధించి మదురై కోర్టు ఇచ్చిన మరణశిక్ష తీర్పును దేశవ్యాప్తంగా ప్రజలు స్వాగతిస్తున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్‌పీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు.రాజమండ్రిలో ఆర్‌పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మానవ హక్కులు, న్యాయం అందుబాటులో లేకపోతే సమాజంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉందన్నారు. పౌరుల ఆత్మగౌరవం, స్వేచ్ఛకు ప్రభుత్వం భరోసాగా నిలవాలని సూచించారు.
సాత్తాంకుళం ఘటనలో పోలీసులే సాక్ష్యాలను తారుమారు చేసినప్పటికీ, అదే పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రేవతి ఒత్తిడులకు లొంగకుండా ధైర్యంగా నిజం వెల్లడించడం వల్లే నిందితులకు మరణశిక్ష విధించేలా తీర్పు వచ్చిందన్నారు. ఆమె నిబద్ధత, నిజాయితీ పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
పోలీస్ వ్యవస్థలో ఉన్నతాధికారులు, దిగువ సిబ్బంది మధ్య వైఖరిలో వ్యత్యాసం ఉందని విమర్శించారు. కొంతమంది పోలీసులు అవినీతి, అధికార దుర్వినియోగానికి లోనై ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారని అన్నారు. చట్టబద్ధంగా విధులు నిర్వహిస్తేనే పోలీసులకు గౌరవం, ప్రజల మద్దతు లభిస్తుందని తెలిపారు.అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని లాకప్ మరణాలు, అనుమానాస్పద హత్యల కేసుల్లో న్యాయం జరగలేదని ఆరోపించారు. అలాంటి కేసులపై ప్రభుత్వం స్పందించి, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తే తాము అందుబాటులో ఉన్న ఆధారాలతో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.ఈ సమావేశానికి ఆర్‌పీసీ సీనియర్ నాయకుడు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా, డి.వి. రమణమూర్తి, ఎం.డి. హుస్సేన్, సిమ్మా దుర్గారావు, దుడ్డే త్రినాద్, దోషి నిషాంత్, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, సుంకర వెంకట భాస్కర రంగారావు, కొల్లి సత్యనారాయణ, చల్లా సాంబశివరావు, సింహాద్రి తిలక్, మేకల కిరణ్ కళ్యాణ్, కందివలస రమణ, అడపా శేషగిరి, ముప్పన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments