పాలనా సంస్కరణలతోనే ప్రజా రక్షణ - ఆర్పిసి అధ్యక్షుడు మేడా శ్రీనివాస్
క్యాపిటల్ వాయిస్: రాజమహేంద్రవరం: ఏప్రిల్ 6:- రాష్ట్రంలో పాలనా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అత్యవసరం ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆర్‌పీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వారాంత సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు.పోలీస్ స్టేషన్ల మాదిరిగా భద్రతా రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, న్యాయస్థానాల తరహాలో ప్రత్యేక “ధర్మస్థానాలు” అమలు చేయాలని సూచించారు. అలాగే రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనితీరును మెరుగుపరుస్తూ అత్యంత భద్రతతో కూడిన వ్యవస్థను తీసుకురావాలని అన్నారు. అవినీతి నిరోధక శాఖ నిబంధనల్లో ప్రైవేట్ వీడియో, ఆడియో వంటి సాక్ష్యాలను కూడా చేర్చాలని కోరారు.ప్రస్తుతం రాజకీయ ప్రభావం కారణంగా పోలీస్ శాఖ స్వతంత్రంగా పనిచేయలేని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. బాధితుల కంటే నేరస్తులు పోలీస్ స్టేషన్లకు ధైర్యంగా వెళ్లే పరిస్థితి ఉందని అన్నారు. పోలీసులకు కేవలం ఎఫ్‌ఐఆర్ నమోదు బాధ్యత ఇచ్చి, నేర పరిశోధనను ప్రత్యేక విభాగానికి అప్పగిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమని సూచించారు. కొన్ని క్రిమినల్ కేసులకు ప్రత్యేక భద్రతా కేంద్రాలు, కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.న్యాయ వ్యవస్థలో కూడా ఆలస్యాలు, పరిశోధన లోపాలు కారణంగా నేరస్తులకు శిక్షలు పడటం లేదని విమర్శించారు. సాక్షులకు భద్రత లేకపోవడం, న్యాయస్థానాల్లో సానుకూల వాతావరణం లేకపోవడం వల్ల న్యాయంపై నమ్మకం తగ్గుతోందన్నారు. తాత్కాలికంగా న్యాయ నిపుణులతో ప్రత్యేక ధర్మస్థానాలను ఏర్పాటు చేసి సత్వర న్యాయం అందించే విధానం తీసుకురావాలని సూచించారు.రెవిన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో అధికంగా జరుగుతున్న అక్రమాలు, నకిలీ పత్రాల సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి ఆస్తి వివాదం మొదలైతే బాధితుడు జీవితకాలంలో న్యాయం పొందే అవకాశాలు తగ్గిపోతున్నాయని అన్నారు. ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలోనే రెవిన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ శాఖలను అనుసంధానం చేసి హక్కుదారుని పేరు నమోదు అయ్యే విధంగా వ్యవస్థ మార్పులు చేయాలని సూచించారు. భూ నేరాలపై ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ విభాగం ఏర్పాటు చేయాలని కోరారు.అవినీతి నిరోధక శాఖ పనితీరుపై కూడా విమర్శలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా పనులు జరగడం కష్టమైందని ప్రజాభిప్రాయం ఉందన్నారు. పౌరులు అందించే డిజిటల్, వీడియో, ఆడియో సాక్ష్యాలను ఆధారంగా తీసుకుని తక్షణ చర్యలు తీసుకునేలా చట్టాల్లో మార్పులు చేయాలని సూచించారు. నిజమైన సమాచారాన్ని అందించే పౌరులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా సామాజిక బాధ్యత పెరుగుతుందని అన్నారు.ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు చేపట్టి ప్రజలను పాలనలో భాగస్వాములను చేయాలని మేడా శ్రీనివాస్ కోరారు.ఈ సమావేశానికి ఆర్‌పీసీ సీనియర్ సెక్యులర్ నాయకుడు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. సమావేశంలో డి.వి. రమణమూర్తి, సిమ్మా దుర్గారావు, దుడ్డే సురేష్, వర్ధనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, కాకర ప్రసాద్, కందివలస రమణ, కారుమూరి శిరీష, పేరూరి శివ, ముప్పిడి భద్ర, చల్లా సాంబశివరావు, చల్లా వంశీ, లంక వీర వెంకట సత్యనారాయణ, నాగురు అన్నపూర్ణ, యర్రా బాలమురళి కృష్ణ, నాగురి బాను తదితరులు పాల్గొన్నారు.

0 Comments